తాడేపల్లిగూడెం, 28 సెప్టెంబర్ (హి.స.)ఇప్పటివరకు పంటల పై దోమలు దాడి చేయడం పురుగులు దాడి చేయడం చూసాం …కానీ నత్తలు దాడి చేయడం ఎప్పుడైనా చూశారా… ఉభయ గోదావరి జిల్లాలలో పంటలు పై ఆఫ్రికా జాతి నత్తలు దాడి చేస్తున్నాయి.ఈ నత్తల దాడిలో పంటలు పండ్ల తోటలు నిలువునా ఎండిపోతున్నాయి.దీంతో రైతులకు కంటి మీద కునుకు ఉండటం లేదు.లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట చేతికి అందే సమయానికి నత్తలు తినేయడం తో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వీటి నివారణ సాధ్యం కాక ఉద్యానవన శాస్త్రవేత్తలను ఆశ్రయించారు రైతులు. ఆఫ్రికా నత్తలుగా పేర్కొనే ఇవి ఇక్కడి పంటలకు మరణశాసనం రాస్తున్నాయి. వందలు, వేల సంఖ్యలో ఈ నత్తలు పొలాల్లో, తోటల్లో గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. గడ్డి, ఆకులు, లేత మొక్కలు అంటూ తేడా లేకుండా అన్నింటినీ తినేస్తు న్నాయి. ప్రధానంగా నిమ్మ, కోకో, పామాయిల్, బొప్పాయి, జామ తోటల్లో చెట్టు కాండాలను పట్టుకుని వాటిలోని రసాన్ని పీల్చేస్తున్నాయి.
ఈ నత్తల బెడద ఉభయ గోదావరి జిల్లాల్లో తాజాగా వెలుగుచూసింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఉద్యాన వర్సీటీకి ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని పెంట్లమ్మ ఆడవి ప్రాంతం సమీపంలోని వ్యవసాయ భూముల్లో ఈ ఆఫ్రికా జాతి నత్తలు తిష్టవేశాయి. ఆవపాడు, నల్లజర్ల, ప్రకాశరావు, పాలెం, ముసళ్లగుంట, సింగరాజపాలెం ప్రాంతాల్లో ఎక్కువగా ఉద్యాన పంటలను రైతులు సాగు చేస్తుంటారు.
ఈ తోటలకు ఆఫ్రికా నత్తల బెడద అధికంగా ఉంది. చెట్ల కాండాలను పట్టుకుని దాని రసాన్ని తాగేస్తున్నాయి. మొక్కల ఆకులు, చిగురులను కూడా ఇవి వదలడం లేదు. ఆకులను పశు వులు మేసినట్లు మేసేస్తున్నాయి. దీంతో మొక్కలు ఎండి పోయి చనిపోతుండడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
మూడు నెలల క్రితం అక్కడక్కడ ఈ నత్తలు కనిపించాయి. మొదట్లో రైతులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే కొద్ది రోజు ల్లోనే వీటి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. తీవ్రతను గుర్తించిన రైతులు వాటిని ఏరి తగలబెట్టారు. అయినా పూర్తి స్థాయిలో వీటి నివారణ జరగలేదు. పురుగు మందులు పిచికారి చేసైనా వాటిని అదుపు చేయలేకపోయారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి