అమరావతి, 28 సెప్టెంబర్ (హి.స.)
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరిగాయి. విపక్ష వైసీ పీ ఎమ్మెల్యేలు సభకు హాజరుకాకున్నా స్వపక్షమే విపక్షం అవతారమెత్తి సమస్యలపై గళం వినిపించింది. సమావేశా లు ఈనెల 18న ప్రారంభమై 27తో ముగిశాయి. టీడీపీ, బీజేపీ, జనసేన సభ్యులు సభలో వివిధ ప్రజాసమస్యలు లేవనెత్తారు. టిడ్కో ఇళ్లు, పేదలకు ఇళ్ల స్థలాలు, ఆరోగ్యశ్రీ, కాలుష్య నియంత్రణ, రోడ్లు, వంతెనల దుస్థితి.. తదితర సమస్యలను ప్రస్తావించారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు తమ వ్యక్తిగత అజెండా కోసం అసెంబ్లీని వేదికగా చేసుకోవడం.. దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్ కావడం.. చర్చనీయాంశమైంది. టీడీపీ ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, కూన రవికుమార్, బొండా ఉమ వంటి వారు ప్రస్తావించిన అంశాలను సీఎం సీరియ్‌సగా తీసుకున్నారు. ఇవన్నీ ప్రజలకు లబ్ధి చేకూర్చేకన్నా.. సభ్యుల వ్యక్తిగత అజెండాలకు ప్రాధాన్యమిచ్చేలా ఉన్నాయన్నారు. తొలిరోజు జీఎస్టీపై పవర్ పాయింట్ ప్రజంటేషన్(పీపీటీ) ఇచ్చిన సీఎం చంద్రబాబు సమావేశాలు జరిగిన ప్రతిరోజూ స్వల్పకాలిక చర్చపై ప్రజంటేషన్ ఇస్తూ వచ్చారు. రెండో రోజు నీటిపారుదల రంగంపై, మూడో రోజు వ్యవసాయంపై, నాలుగో రోజు ఆరోగ్య రంగంపై పీపీటీ ద్వారా సభ్యులకు సమాధానమిచ్చారు. ఆరో రోజు పెట్టుబడులు, లాజిస్టిక్స్‌పై, ఏడో రోజు సూపర్ సిక్స్‌పై పీపీటీ ఇచ్చారు. ఈ సమావేశాలు 8 రోజులపాటు జరిగ్గా 23 బిల్లులు ఆమోదం పొందాయి. మూడు బిల్లులు ఉపసంహరించుకోగా, 6 అంశాలపై లఘు చర్చ జరిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ