అమరావతి, 28 సెప్టెంబర్ (హి.స.)స్థానికంగా, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. కృష్ణా, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రెండు నదులు ఉగ్రరూపం దాల్చడంతో.. నదీపరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ప్రవహిస్తోందని, రాజమండ్రిలో ఉన్న ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపింది.
కాగా.. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బలహీన పడుతున్న క్రమంలో రేపు ఏపీపై వర్షప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చని అంచనా వేసింది. ఆదివారం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి