విజయవాడ, 28 సెప్టెంబర్ (హి.స.)
దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లే వారితో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ పెరిగింది. దీంతో హైదరాబాద్లోని విజయవాడ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఈ మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
భారీ వర్షాల కారణంగా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గౌరెల్లి వద్ద వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో అక్కడ వాహన రాకపోకలు నిలిచిపోయాయి. గౌరెల్లి వంతెన వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి స్థానికులను అప్రమత్తం చేశారు.
మరోవైపు వర్షాలకు ఉప్పల్ చౌరస్తా వద్ద వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి.
నగరవాసులు స్వస్థలాల బాట : దసరా పండగ నేపథ్యంలో హైదరాబాద్ నగరవాసులు స్వస్థలాల బాట పట్టారు. రేపటి (ఆదివారం) నుంచి కళాశాలలకు సెలవులు ప్రారంభం కావడం, పిల్లలకు ఇప్పటికే సెలవులు ఉండటం, మరోవైపు సోమవారం సద్దుల బతుకమ్మతో అందరూ సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఇవాళ్టి నుంచే ప్రయాణాలు ప్రారంభించారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిలో వాహనాల రద్దీ పెరిగింది.
విజయవాడ వైపు వాహనాలు బారులు : వాహనాల రద్దీతో రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ట్రాఫిక్ సమస్యలు మాత్రం నివారించలేకపోయారు. దీంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి (65వ నంబర్)లో వాహనాల రద్దీ పెరిగింది. విజయవాడ వైపు వాహనాలు బారులు తీరుతున్నాయి. పట్టణ వాసులంతా ఒక్కసారిగా పల్లెబాట పట్టడంతో హైదరాబాద్ నగరంలోని ప్రధాన రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. టోల్ గేట్ల వద్ద కూడా రద్దీ కనిపిస్తోంది. వాహనాలు వేగంగా వెళ్లేందుకు, ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి