అమరావతి, 29 సెప్టెంబర్ (హి.స.)
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో శ్రీ సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సతీసమేతంగా ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. చినరాజగోపురం వద్ద స్థానాచార్యులు శివ ప్రసాద్‌శర్మ సీఎంకు పరివేష్టనం కట్టారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు.
‘‘ దుర్గమ్మ ప్రజలందర్నీ ఆశీర్వదించాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నా. రిజర్వాయర్లు జలకళ సంతరించుకోవడంతో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. రాష్ట్రంలోని రిజర్వాయర్లు 94 శాతం మేర నిండాయి. భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనాలు కల్పిస్తున్నాం. సాధారణ భక్తుల దర్శనానికి అధిక సమయం కేటాయిస్తున్నాం. అన్నప్రసాద భవన నిర్మాణం ఆరు నెలల్లో పూర్తవుతుంది. ఒకేసారి 1500 మంది అన్న ప్రసాదాలు స్వీకరించేందుకు వీలుగా రూ.25 కోట్లతో భవనం నిర్మిస్తున్నాం. ప్రసాదం తయారీ కోసం రూ.27 కోట్లతో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఈ పనులను 3 నెలల్లో పూర్తి చేస్తాం. ప్రధాన ఆలయం వద్ద రూ.5.5 కోట్లతో పూజా మండప నిర్మాణం చేపడుతున్నాం. దాతల సహకారంతో యాగశాల ఏర్పాటు చేస్తున్నాం.’’ అని చంద్రబాబు అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ