హైదరాబాద్, 29 సెప్టెంబర్ (హి.స.) సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్తు
ఆయనకే తెలియదు, ఇక ఫ్యూచర్ సిటీ ఎక్కడిదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దందా నడుస్తున్నదని ఆరోపించారు. ఓ పథకం ప్రకారం ఎల్ అండ్ టీ సంస్థపై ఒత్తిడి తెచ్చి హైదరాబాద్ మెట్రో నుంచి తప్పించారని, తద్వారా రూ.వెయ్యి కోట్లు లాభం పొందాడన్నారు. రాష్ట్ర ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం మోపారని విమర్శించారు. హైదరాబాద్ మెట్రో ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ మెట్రోకు ఉన్న రూ.35వేల కోట్ల ఆస్తులను ఆదాని, మెగాకి కట్టబెట్టడానికి ప్రణాళిక సిద్ధం చేశారన్నారు.. ఫ్యూచర్ లేని సిటీ ఫ్యూచర్ సిటీ అన్నారు. జనమే లేని చోట, ఇండ్లు లేని చోట, జనావాసాలు లేని చోట ఫోర్త్ సిటీకి రోడ్లు వేస్తా, మెట్రో తీసుకోపోతా అని రేవంత్ రెడ్డి అంటున్నాడని మండిపడ్డారు. గురుశిష్యులు ఇద్దరు కలిసి ఒకే రైలులో అమరావతికి వెళ్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. కాంగ్రెస్ వచ్చాక ఒక్క తట్టెడు మట్టి కూడా వేయలేదు. ఇల్లు లేని దగ్గర రోడ్లు వేయడం రేవంత్ మూర్ఖత్వమే అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి అని ప్రజలు నమ్మడం లేదని, ఈ ప్రభుత్వంపై విశ్వాసం లేదన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు