హైదరాబాద్, 29 సెప్టెంబర్ (హి.స.)
పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో ఉద్రిక్తతలు తలెత్తాయి. పీవోకేలో ప్రధాని షెబ్బాబ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మౌలిక సంస్కరణలు కోరుతూ అవామీ యాక్షన్ కమిటీ నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు.
షట్టర్ డౌన్, వీల్ జామ్ పేరుతో అవామీ యాక్షన్ కమిటీ (AAC) పీవోకేలో సమ్మెకు పిలుపునిచ్చింది. వేల సంఖ్యలో ప్రజలు నిరసనల్లో పాల్గొన్నారు. ఈ మేరకు పీవోకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలని కోరుతూ ఏఏసీ పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. తమ ఆందోళనలు ఏ సంస్థకూ వ్యతిరేకం కాదని ఏఏసీ కీలక నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ అన్నారు. 70 ఏళ్లకుపైగా పీవోకేలోని ప్రజలకు ప్రాథమిక హక్కులు కూడా కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు హక్కులను అందించడం ప్రభుత్వం బాధ్యత అని అన్నారు.పాక్ ప్రభుత్వం దశాబ్దాలుగా తమను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. 'మా హక్కులు మాకు కల్పిస్తారా.. ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొంటారా..?' అంటూ హెచ్చరించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే నిరసనలను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించింది. ఈ నిరసనలతో పాక్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పీవోకేలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించింది. ఆందోళనల నేపథ్యంలో పీవీకే ఆదివారం అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. చెక్ పోస్టులు, ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు