తిరుపతి , 29 సెప్టెంబర్ (హి.స.)
తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో దారుణ ఘటన వెలుగుచూసింది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను ఓ కసాయి తల్లి ఇసుకలో పూడ్చి పెట్టింది. బిడ్డకు కష్టం రాకుండా చూసుకోవాల్సిన తల్లే ఈ ఘాతుకానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున బస్టాండ్ సమీపంలో ఉన్న ఒక దుకాణం వద్ద ఇసుకలో పూడ్చిన శిశువును పారిశుద్ధ్య కార్మికులు గుర్తించారు. స్థానికుల సహాయంతో ఆ బిడ్డను ఆస్పత్రికి తరలించిగా వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని యువతి ఆడబిడ్డకు జన్మనిచ్చి.. పురిటి బిడ్డను ఇసుకలో పాతిపెట్టి వెళ్లిపోయినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి