నైరుతి. ఋతుపవనాల సీజన్ మంగళవారం తో.ముగియనుంది
విశాఖపట్నం,30 సెప్టెంబర్ (హి.స.) :నైరుతి రుతుపవనాల సీజన్‌ మంగళవారంతో ముగియనుంది. నాలుగు నెలల సీజన్‌లో తొలి రెండు నెలలు(జూన్‌, జూలై) తీవ్ర దుర్భిక్షం నెలకొనగా, చివరి రెండు నెలలు(ఆగస్టు, సెప్టెంబరు) అనేకచోట్ల భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో 570.6 మిల
Rains


విశాఖపట్నం,30 సెప్టెంబర్ (హి.స.) :నైరుతి రుతుపవనాల సీజన్‌ మంగళవారంతో ముగియనుంది. నాలుగు నెలల సీజన్‌లో తొలి రెండు నెలలు(జూన్‌, జూలై) తీవ్ర దుర్భిక్షం నెలకొనగా, చివరి రెండు నెలలు(ఆగస్టు, సెప్టెంబరు) అనేకచోట్ల భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో 570.6 మిల్లీమీటర్లకుగాను జూన్‌ నుంచి సోమవారం వరకు 553.1 మిల్లీమీటర్ల (3.1 శాతం తక్కువగా) వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లాలో 43.4 శాతం ఎక్కువ, కర్నూలు జిల్లాలో 37.9 శాతం ఎక్కువ, చిత్తూరులో 22.5 శాతం ఎక్కువ, అన్నమయ్య జిల్లాలో 19.6 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. అంటే నాలుగు జిల్లాల్లో మిగులు వర్షాలు కురిశాయి. మరో నాలుగు జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. కోనసీమ జిల్లాలో 30.4ు, నెల్లూరులో 20.6ు, తూర్పుగోదావరిలో 22.2ు, పశ్చిమ గోదావరిలో 23.9ు తక్కువగా వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని మిగిలిన 16 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోని ఎక్కువ మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. కోస్తాతో పోల్చితే రాయలసీమలో ఎక్కువ మండలాల్లో మిగులు వర్షం కురిసింది. జూన్‌, జూలై నెలల్లో వర్షాలు ముఖం చాటేయడంతో వేసవి తీవ్రత కొనసాగింది.

ఖరీఫ్‌ పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ రెండు నెలల్లో సాధారణం కంటే 25 శాతం వరకు లోటు వర్షపాతం నమోదవడంతో రైతాంగం ఆందోళన వ్యక్తం చేసింది. కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ వర్షాభావం నెలకొంది. నెల్లూరు జిల్లాలో చాలావరకు పొడి వాతావరణంతో రైతులు సతమతమయ్యారు. అయితే ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వర్షాలు పెరగడంతో ఖరీఫ్‌ సాగు జోరందుకుంది. అనేక ప్రాంతాల్లో మంచి వర్షాలు కురిశాయి. కర్నూలు, గుంటూరు, ఎన్టీఆర్‌, ఏలూరు జిల్లాల్లో వరదలు సంభవించాయి. కృష్ణా, గోదావరి బేసిన్‌లో కురిసిన వర్షాలతో డ్యామ్‌లు నిండాయి. వాతావరణ శాఖ లెక్కల మేరకు సెప్టెంబరు 30తో నైరుతి సీజన్‌ ముగుస్తుండగా, ఆ తర్వాత కూడా వర్షాలు కురిసే వాతావరణం నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande