దిల్లీ: 30 సెప్టెంబర్ (హి.స.)సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) 21 సూత్రాల శాంతి ఫార్ములాను సూచించిన సంగతి తెలిసిందే. దీనికి ఇజ్రాయెల్ (Israel) కూడా అంగీకరించింది. తాజాగా ట్రంప్ ప్లాన్‌ను భారత ప్రధాని మోదీ (PM Modi) స్వాగతించారు. అమెరికా అధ్యక్షుడి ప్రణాళిక దీర్ఘకాలిక శాంతికి మార్గమని పేర్కొన్నారు.
ఈమేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘గాజా (Gaza)లో యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సమగ్ర ప్రణాళికను స్వాగతిస్తున్నాం. ఇది పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజలతో పాటు పశ్చిమాసియా ప్రాంతానికి దీర్ఘకాలిక, స్థిరమైన శాంతిభద్రతకు మార్గమవుతుంది. యుద్ధం ముగించి, శాంతిని నెలకొల్పే ఈ ప్రయత్నానికి అందరూ మద్దతు ఇస్తారని ఆశిస్తున్నా’ అని మోదీ రాసుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ