ముంబయి,30సెప్టెంబర్ (హి.స.) టాటా గ్రూప్ మార్కెట్ విలువ ఈ ఏడాదిలో ఇప్పటికి 75 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.6.6 లక్షల కోట్ల)కు పైగా తగ్గింది. ఇందులో అయిదోవంతు ఈ నెల 19 తర్వాతే కోల్పోవడం గమనార్హం. ఫలితంగా గ్రూప్‌లోని 16 కంపెనీల మార్కెట్ విలువ గత శుక్రవారం 287 బి. డాలర్ల (దాదాపు రూ.25.25 లక్షల కోట్ల)కు పరిమితమైంది. ఇది రెండేళ్ల కనిష్ఠ స్థాయి. హెచ్1బీ వీసాలపై అమెరికా ఆంక్షల నుంచి సైబర్ దాడుల వరకు పలు సవాళ్లు ఎదురుకావడంతో టాటా గ్రూప్ మార్కెట్ విలువ ఈ నెల 19 నుంచే 20 బిలియన్ డాలర్లకు పైగా తగ్గింది.
టీసీఎస్: టాటా గ్రూప్‌లో ప్రధాన కంపెనీ అయిన టీసీఎస్ షేరు గతవారంలో 8% నష్టపోయింది. 2020 తర్వాత వారం వారీ నష్టాల్లో ఇదే అత్యధికం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్1బీ కొత్త వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడంతో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో షేర్లు నష్టపోయాయి. ఈ కంపెనీలు ఆన్‌షోర్ కాంట్రాక్టుల విషయంలో ఆచితూచి అడుగేయాల్సి వస్తుందని, దీంతో కొన్ని త్రైమాసికాల వరకు కొత్త కాంట్రాక్టుల బుకింగ్‌పై ప్రభావం ఉంటుందని బ్లూమ్‌బర్గ్ ఇంటెలిజెన్స్ విశ్లేషకులు అంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ