కరూర్ /దిల్లీ: 30 సెప్టెంబర్ (హి.స.) సినీ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట (Karur stampede)లో మృతుల సంఖ్య 41కి పెరిగింది. ఈ ఘటనపై చర్యలు చేపట్టిన పోలీసులు తాజాగా ఓ యూట్యూబర్‌ను అరెస్టు చేశారు. విజయ్ ర్యాలీలో జరిగిన ప్రమాదంపై నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్న తమిళనాడు యూట్యూబర్ ఫెలిక్స్ జెరాల్డ్ (YouTuber Felix Gerald)ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. రెడ్‌పిక్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్న జెరాల్డ్ తొక్కిసలాట ఘటనకు సంబంధించినదని చెబుతూ.. నకిలీ కంటెంట్‌ను తన ఛానల్‌లో ప్రచారం చేశారు.
టీవీకే పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రజలను రెచ్చగొట్టేలా జెరాల్డ్ నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నట్లు (Spreading Fake News) ఫిర్యాదులు అందడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నందుకు మరో 25 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. వారందరినీ కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది. ప్రజాశాంతికి భంగం కలిగించే, ఉద్రిక్తతలను రేకెత్తించేలా సోషల్ మీడియాలో కంటెంట్ షేర్ చేస్తున్నందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ