న్యూఢిల్లీ, 30 సెప్టెంబర్ (హి.స.) భారతీయ జనతా పార్టీ (బీజేపీ)
సీనియర్ నాయకుడు విజయ్ కుమార్ మల్హోత్రా ఈ రోజు ఉదయం ఢిల్లీలో కన్నుమూశారు. న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. అయన బీజేపీ స్థాపకుల్లో ఒక్కరుగా, దీర్ఘకాలం రాజకీయ జీవితంలో పలు కీలక స్థానాల్లో సేవలందించారు. 1999లో జరిగిన లోక్సభఎన్నికల్లో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్పై పోటీ చేసి గెలుపొందడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక ముఖ్య ఘట్టం గా నిలిచింది. విజయ్ కుమార్ మల్హోత్రా కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా, జాతీయ స్థాయి క్రీడా సంస్థల్లోనూ కీలక పాత్ర పోషించారు. ఆయన అర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. సుదీర్ఘకాలం ప్రజలకు, క్రీడా రంగానికి, పార్టీకి అంకితభావంతో పనిచేసిన ఆయన మరణం బీజేపీకి, దేశ రాజకీయాలకు అపార నష్టం అని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు