
అమరావతి, 12 జనవరి (హి.స.)
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) రాష్ట్ర అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు. సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాసు పుస్తకాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అమరావతిని శ్మశానం ఎడారి అని హేళన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఇదో స్ఫూర్తిదాయక ప్రాజెక్టు అన్నారు. అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తున్నామని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్టుగా అభివర్ణించారు. రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ విధానంలో 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూమిని ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారని సీఎం కొనియాడారు.
నీటి వనరుల వినియోగంపై స్పందిస్తూ, ప్రస్తుతం మూడు వేల టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రంలో వృథాగా కలుస్తున్నాయని అన్నారు. రాబోయే జూన్ నాటికి గ్రావిటీ ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినా ఏపీ అడ్డుపడలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం 88 శాతం పనులు పూర్తయిన పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు కూడా నీటిని ఇచ్చే స్థాయికి చేరుకుంటుందని ధీమా వ్యక్తపరిచారు. అన్ని రిజర్వాయర్లలో 970 టీఎంసీల నీటిని నిల్వ చేశామన్నారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV