
ఢిల్లీ, 12 జనవరి (హి.స.) తమిళునాడు కరూర్ సమావేశంలో జరిగిన తొక్కిసలాట సంఘటనకు సంబంధించి సీబీఐ విచారణకు తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు, ప్రముఖ తమిళు మరియు తెలుగు నటుడు విజయ్ స్వయంగా హాజరయ్యారు. ఈ విషయంలో విజయ్‌ను పలు ప్రశ్నలు అడగనున్నట్లు సమాచారం.
తమిళనాడులోని కరూర్ జిల్లాలో జరిగిన ఘోర తొక్కిసలాట (Stampede) జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో పాటు, మద్రాస్ హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. దీంతో ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి, తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు, ప్రముఖ తమిళు మరియు తెలుగు నటుడు విజయ్ (Actor Vijay) ఈ రోజు(12-01-2026)న న్యూఢిల్లీలోని సీబీఐ (CBI) ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో, సభ నిర్వహణలో లోపాలు, భద్రతా వైఫల్యాలపై వివరణ ఇవ్వాల్సిందిగా సీబీఐ విజయ్‌కు నోటీసులు జారీ చేయడంతో ఆయన నేడు విచారణకు వచ్చారు.
సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ విచారణలో, సభకు తీసుకున్న అనుమతులు, జనసమీకరణ అంచనాలు, అక్కడ కల్పించిన భద్రతా చర్యల గురించి అధికారులు విజయ్‌ను ప్రశ్నించినట్లు సమాచారం.
విచారణ అనంతరం బయటకు వచ్చిన విజయ్, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, దర్యాప్తుకు సంపూర్ణ సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. మరోవైపు, విజయ్ ఢిల్లీకి చేరుకున్నారన్న వార్తతో సీబీఐ కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు గుమికూడటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ విచారణ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV