
కోల్‌కతా, 12 జనవరి (హి.స.)ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందేభారత్ స్లీపర్ రైలు (Vande Bharat Sleeper) పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. అత్యాధునిక సదుపాయాలతో, దూర ప్రాంత ప్రయాణాలకు అనువుగా ఉండే ఈ రైలు కోల్‌కతా- గువాహటి మధ్య త్వరలో పరుగులు పెట్టనుంది. ఈ నేపథ్యంలో వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించిన ఛార్జీల వివరాలు, బుకింగ్ రూల్స్‌ను రైల్వే శాఖ నోటిఫై చేసింది. ఆ వివరాలు ఇవీ..
ఈ రైలులో కనీస ఛార్జి రూ.960 నుంచి ప్రారంభమవుతుంది. 400 కిలోమీటర్ల ప్రయాణానికి 3ఏసీ ప్రయాణానికి ఈ ఛార్జీ వర్తిస్తుంది. అంటే ప్రయాణికుడు అంతకంటే తక్కువ దూరానికే టికెట్ బుక్ చేసుకున్నా ఈ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందన్నమాట. గరిష్ఠంగా 3,500 కిలోమీటర్లకు 1ఏసీ ఛార్జీ రూ.13,300గా నిర్ణయించారు. కిలోమీటర్ వారీగా చూసినప్పుడు (కనీస టికెట్ ధర).. 3 ఏసీకి కిలోమీటరుకు రూ.2.4 చొప్పున రూ.960; 2 ఏసీకి కిలోమీటరుకు రూ.3.1 చొప్పున రూ.1,240; 1 ఏసీకి కిలోమీటరుకు రూ.3.8 చొప్పున రూ.1,520 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. దూరాన్ని బట్టి టికెట్ ధరలు పెరుగుతాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ