
తిరుపతి, 14 జనవరి (హి.స.) :తిరుపతి నగరం అలిపిరిలో టౌన్‌షి్‌ప నిర్మాణం అనేది బోర్డు సభ్యులందరూ చర్చించి తీసుకున్న సమష్టి నిర్ణయమని టీటీడీ స్పష్టం చేసింది. ఈనెల 12వ తేదీ సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘‘ఈ తిరకాసేమిటి తిరుమలేశా?’’ అన్న శీర్షికన ప్రచురితమైన వార్తపై టీటీడీ స్పందించింది. భక్తుల సౌలభ్యం కోసం వారు సులువుగా చేరుకునే అలిపిరి ప్రాంతంలో వసతి సముదాయం ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుందని బోర్డు నిర్ణయించిందని దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. సమష్టిగా తీసుకున్న ఆ నిర్ణయాన్ని టీటీడీ చైర్మన్‌కు ఆపాదించడం సరైంది కాదని తెలిపింది. 2018లోనే అలిపిరి సమీపంలో భక్తుల వసతి సదుపాయాల కోసం శిల్ప శిక్షణా సంస్థ పరిసరాల్లో 38 ఎకరాల్లో నాలుగు బ్లాకులతో కూడిన భవన సముదాయాన్ని నిర్మించాలని టీటీడీ బోర్డు తీర్మానం చేసిందని తెలిపింది.
2019-24 మధ్య వైసీపీ హయాంలో అలిపిరి కాకుండా ప్రత్యామ్నాయ ప్రాంతంలో స్పిరిచ్యువల్ సిటీ ఏర్పాటు కోసం 2021, 2022, 2023లో నాలుగు సార్లు బోర్డు తీర్మానాలు చేసిందని తెలిపింది. అయితే ఆ ఐదేళ్లలో ఈ దిశగా ఎలాంటి అభివృద్ధీ జరగలేదని పేర్కొంది. గతేడాది డిసెంబరు 16న అలిపిరి-చెర్లోపల్లి రోడ్డులో పేరూరు గ్రామ సర్వే నంబరు 604-9లో టీటీడీకి చెందిన 20 ఎకరాల భూమిలో తీర్థ యాత్రికుల టౌన్‌షి్‌ప నిర్మాణానికి డిజైన్లు రూపొందించే ప్రతిపాదన బోర్డు సమావేశంలో చర్చకు వచ్చిందని, దీనిని శిల్ప శిక్షణా సంస్థ, ప్రొడక్షన్ సెంటర్ ఉన్న ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని తీర్మానించినట్టు తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ