
, ఏలూరు 14 జనవరి (హి.స.)
: రాష్ట్రం మొత్తం సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతుంటే.. ఏలూరులో మాత్రం ఆ సందడే కనిపించడం లేదు. ఎందుకంటే.. దశాబ్దాలుగా నిర్వహిస్తూ వస్తున్న గ్రామదేవత ఉత్సవాలు సరిగ్గా ఇదే సమయంలో రావడమే ఇందుకు కారణం. ఏలూరువాసులు 12 ఏళ్లకోసారి గ్రామదేవత గంగానమ్మ జాతర నిర్వహించుకుంటారు. కొన్నేళ్ల నుంచి ఏడేళ్లకోసారి చేసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు గతేడాది అక్టోబరు 26న జాతర మొదలైంది. మొత్తం 96 రోజులు జరిగే ఈ ఉత్సవం ఫిబ్రవరి 9తో ముగియనుంది. ఈ రోజుల్లో నగరం కోలాహలంగా ఉంటుంది. రోజుకో గ్రామదేవత గుడిలో పూజలు చేస్తారు. జాతర జరుగుతున్న రోజుల్లో స్థానికులు ఏ పండగలూ చేసుకోరు. కొత్త దుస్తులు ధరించరు. నిర్మాణాలు చేపట్టరు.. శుభకార్యాలూ చేసుకోరు. ఈ ఆనవాయితీ వల్ల ప్రస్తుతం ఏలూరులో సంక్రాంతి సంబరాలు కనిపించడం లేదు. జాతర ముగింపు రోజు మాత్రం పెద్దఎత్తున పండగ చేసుకుంటారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ