
అమరావతి, 17 జనవరి (హి.స.)
సాంకేతికతను వినియోగించి ప్రయాణికులకు అత్యుత్తమ సేవలను అందించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) చేస్తున్న కృషికి జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Mandipally Ramprasad Reddy) అన్నారు. ఆర్టీసీకి ప్రతిష్టాత్మక గవర్నెన్స్ నౌ–ఆరో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సమ్మిట్ అవార్డు (Governance Now Auro Digital Transformation Summit Award) వచ్చిన సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయమై మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ డిజిటల్ సేవలకు అవార్డు రావడం గర్వకారణం అన్నారు. ఇదంతా ఆర్టీసీ అధికారులు, సూపర్‌వైజర్లు, సిబ్బంది ప్రజలకు అంకితభావంతో సేవలు అందిస్తుండడం వల్లనే సాధ్యమైందన్నారు. ప్రయాణికులకు ముందస్తు సమాచారం అందించడం ద్వారా సేవల నాణ్యత మరింత మెరుగుపడిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డిజిటల్ సాంకేతికతను ప్రజాసేవకు వినియోగించిన ఆర్టీసీ కృషికి ఇది ఒక మైలురాయిగా పేర్కొన్నారు.
ప్రధాన బస్టాప్‌లలో ఆటోమేటిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ (AAS) అమలు చేయడం పట్ల ఆర్టీసీ అధికారులు, సిబ్బందిపై ప్రశంసల వర్షం కురిపించారు. సాంకేతికతను అందిపుచ్చుకొని సీఎం చంద్రబాబు నాయుడు విజన్ కు అనుగుణంగా ఆర్టీసీ ముందడుగు వేస్తోందన్నారు. రాబోయే రోజుల్లో ప్రయాణికులకు మరింత ఆధునిక, సౌకర్యవంతమైన సేవలు అందిస్తామన్నారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV