
ఉజ్జయిని, 17 జనవరి (హి.స.)
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్ (India), న్యూజిలాండ్ (New Zealand) జట్లు చేరో మ్యాచ్‌లో విజయం సాధించి 1-1తో సమంగా నిలిచాయి. ఇక నిర్ణయాత్మకమైన మూడో వన్డే మ్యాచ్ మధ్యప్రదేశ్‌లో ఇండోర్ (Indore) వేదికగా జరగనుంది.
ఈ క్రమంలోనే మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli), స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) ఇవాళ ఉదయం ఉజ్జయినిలో ఉన్న ప్రసిద్ధ శ్రీ మహకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. తెల్లవారుజామున 4 గంటలకు జరిగిన పవిత్ర ‘భస్మ హారతి’లో వారిద్దరూ పాల్గొన్నారు. దాదాపు 2 గంటల పాటు ఆలయంలో గడిపిన విరాట్, కుల్దీప్ నంది హాల్‌లో కూర్చుని స్వామివారిని దర్శించుకున్నారు. అయితే, వారి కంటే ఒకరోజు ముందే టీమ్ ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా మహాకాళేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV