
ఢిల్లీ,17, జనవరి (హి.స.)ఇరాన్ (Iran)లో పరిస్థితులు క్షీణించడంతో అక్కడ చిక్కుకున్న భారతీయులను విదేశాంగ శాఖ (MEA) సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చింది. తొలివిడతలో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి తర్వాత పలువురు భారతీయులు దిల్లీకి చేరుకున్నారు. అనంతరం వారు ఇరాన్‌లో పరిస్థితుల గురించి మీడియాతో మాట్లాడారు. ఇరాన్‌లో ఎక్కడ చూసినా ఆందోళనకారులే ఉన్నారని.. ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితులే లేవన్నారు. వీధుల్లో నిరసనకారుల మృతదేహాలు, ప్రజల హాహాకారాలతో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు.
ఇంటర్నెట్ సదుపాయం నిలిపివేయడంతో తమ పరిస్థితిని కుటుంబసభ్యులకు వివరించే అవకాశం లేక తీవ్ర భయాందోళనకు గురయ్యామన్నారు. విదేశాంగశాఖ అధికారులను సంప్రదించడానికి కూడా వీలు కాలేదన్నారు. ఈ రెండు వారాలపాటు క్షణమొక యుగంలా గడిచిందన్నారు. తిరిగి భారత్‌కు వస్తామనుకోలేదని.. ఇటువంటి క్లిష్ట సమయంలో తమను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తమ వారి కోసం విమానాశ్రయానికి చేరుకున్న కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. చాలా రోజులుగా తమ వారితో ఎటువంటి సంప్రదింపులు లేవన్నారు. ఇరాన్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో వారి పరిస్థితిపై తాము ఆందోళన చెందామని.. కానీ మోదీ ప్రభుత్వం చొరవతో తమ కుటుంబసభ్యులు తిరిగి వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ