
హైదరాబాద్, 18 జనవరి (హి.స.)
బాలీవుడ్లో అవకాశాలు తగ్గడంపై సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు అవకాశాలు తగ్గడానికి పలు కారణాలు ఉండొచ్చని, అందులో మతం కూడా ఒక కారణం అయి ఉండవచ్చేమో అనే భావన వ్యక్తం చేశారు. రెహమాన్ వ్యాఖ్యలను కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు, సోషల్ మీడియా యూజర్లు వివాదాస్పదంగా అభివర్ణించారు.
తన వ్యాఖ్యలపై వివాదం ముదరడo తో ఏఆర్ రెహమాన్ స్వయంగా స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని స్పష్టం చేస్తూ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తాను ఎప్పుడూ ఎవరినీ బాధపెట్టాలనుకోలేదని చెప్పారు. వీడియోలో రెహమాన్ మాట్లాడుతూ... 'భారత్ నాకు ఇల్లు. ఇక్కడే నేను సంగీతాన్ని నేర్చుకున్నాను. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలే నాకు గురువులు. నేను ఎప్పుడూ దేశాన్ని, ప్రజలను విమర్శించలేదు. భారత్ నాకు ఎప్పటికీ స్ఫూర్తి. సంగీతానికి, కళాకారులకు గౌరవం తగ్గిందన్నదే నా ఉద్దేశం. ఒకప్పుడు సంగీతానికి ఉన్న ప్రాధాన్యం ఇప్పుడు తగ్గుతోంది. కమర్షియల్ అంశాలే ఎక్కువ అవుతున్నాయి. నా వ్యాఖ్యలు మతంతో ముడిపెట్టి చూడడం సరైంది కాదు. నేను ఎప్పుడూ ఎవరినీ బాధపెట్టాలని అనుకోలేదు. కళ, సంగీతం, దేశం పట నా ప్రేమ ఎప్పటికీ మారదు. నా నిజాయితీని ఎవరు అనుమానించాల్సిన అవసరం లేదన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు