
హైదరాబాద్, 18 జనవరి (హి.స.) సింగరేణి బొగ్గు గని టెండర్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న కథనాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. ఏబీఎన్ ఛానల్లో ప్రసారమైన ప్రత్యేక కథనం తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ఉందని ఆయన మండిపడ్డారు. దిగజారుడు రాజకీయాల కోసం అబద్ధపు వార్తలు అల్లే సంస్కృతి తనది కాదని, తన క్యారెక్టర్ అంత వీక్ కాదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి తాను ఆస్తులు, వ్యాపారాల కోసం రాలేదని, తెలంగాణ వనరులను ప్రజలకు దక్కేలా చూడటమే తన లక్ష్యమని తేల్చి చెప్పారు. మీడియా సంస్థల ఆరోపణలపై తక్షణమే స్పందించిన ఆయన, పారదర్శకత కోసం సదరు టెండర్లను రద్దు చేసి, తిరిగి టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
జర్నలిస్టుల అరెస్టులు, సిట్ ఏర్పాటు వంటి అంశాలను ముడిపెడుతూ తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని భట్టి ఆరోపించారు. టెండర్ నిబంధనలు బోర్డు నిర్ణయిస్తుందని, ఇందులో వ్యక్తిగత ప్రయోజనాలకు తావు లేదని ఆయన స్పష్టం చేశారు. తనపై ఇలాంటి కథనాలు రాసిన రాధాకృష్ణ త్వరలోనే పూర్తి వివరాలతో సమాధానం చెప్పాల్సి ఉంటుందని, వ్యక్తిగత కక్ష సాధింపులో భాగంగానే ఇలాంటి పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..