
తిరుమల , 18 జనవరి (హి.స.)ప్రముఖ టాలీవుడ్ హీరో శర్వానంద్, హీరోయిన్ సాక్షి వైద్య తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో వీరు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న చిత్ర బృందానికి టీటీడీ అధికారులు సాదర స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
శ్రీవారి దర్శనం పూర్తయిన తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు శర్వానంద్, సాక్షి వైద్యకు వేదాశీర్వచనాలు అందించారు. అనంతరం టీటీడీ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా శర్వానంద్ మీడియాతో మాట్లాడుతూ.. తాము కలిసి నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిందని, ఈ నేపథ్యంలోనే స్వామివారి ఆశీస్సులు పొందేందుకు తిరుమలకు వచ్చినట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీవారి దయతో భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాల్లో నటిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV