
తిరుమల, 18 జనవరి (హి.స.)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తీపి కబురు అందించింది. 2026 ఏప్రిల్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు (Arjitha Sevalu), దర్శన టికెట్ల (Darshanam Tickets) కోటాను విడుదల చేసేందుకు అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. దీని ప్రకారం అత్యంత ప్రాధాన్యత కలిగిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి సేవల టికెట్ల కోసం ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్లు జనవరి 19న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. భక్తులు జనవరి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన వారు జనవరి 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నిర్ణీత రుసుము చెల్లించి తమ బుకింగ్‌ను ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు, జనవరి 22వ తేదీన ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలతో పాటు సాలకట్ల తెప్పోత్సవం, వసంతోత్సవం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, దర్శన స్లాట్ల కోటాను అందుబాటులో ఉంచుతారు. జనవరి 23న అంగప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు, వృద్ధులు, దివ్యాంగుల కోటాను వేర్వేరు సమయాల్లో విడుదల చేస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV