
హైదరాబాద్, 19 జనవరి (హి.స.) కాంగ్రెస్ కండువా కప్పుకొని తప్పు
చేశానని పటాన్చెరు ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ తీవ్ర సంచలనం రేపుతున్నాయి. బీఆర్ఎస్లో గెలిచి అధికార పార్టీలో చేరిన గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారినా వెంట్రుక మందం కూడా ప్రయోజనం లేదంటూ చేసిన వ్యాఖ్యలు స్థానికంగా చర్చనీయాంశం అయ్యాయి. మున్సిపల్ ఎన్నికల వేళ పటాన్చెరు రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కారు గుర్తుపై గెలిచి హస్తం గూటికి చేరి అనూహ్యంగా యూటర్న్ తీసుకున్న ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ఆదివారం మనసులో మాటను బయటపెట్టాడు. బీఆర్ఎస్ తనకు మూడుసార్లు టిక్కెట్ ఇచ్చి గెలిపించిందని తన గెలుపు కోసం పనిచేసిన నాయకులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించుకుంటానన్నారు. గులాబీ పార్టీ అభ్యర్థులకే తన మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
దీనితో ఎమ్మెల్యే గూడెం తిరిగి సొంతగూటికి చేరడం ఖాయమనే చర్చ సాగుతోంది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు