
తిరుమల, 19 జనవరి (హి.స.)
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రేపు(మంగళవారం) కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. అమ్మవారి ఆలయంలో జనవరి 25వ తేదీ రథసప్తమి వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6:30 నుంచి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV