
అమరావతి,: రాష్ట్రంలోని పారా మెడికల్ కోర్సుల విద్యార్థులకు ప్రభుత్వం తొలిసారిగా సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తోందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. రెండేళ్ల వ్యవధి కలిగిన పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన వారు పరీక్షల్లో ఫెయిల్ అయితే.. తిరిగి వార్షిక పరీక్షలప్పుడు మాత్రమే సప్లిమెంటరీ రాసేవారని చెప్పారు. ఈ విధానం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఒక ఏడాది సమయం వృథా అవుతోందని, ఉపాధి అవకాశాలను కూడా కోల్పోతున్నారని మంత్రి పేర్కొన్నారు. అందుకే 2025-26 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని వివరించారు. ఇటీవల జరిగిన పరీక్షల్లో ఉత్తీర్ణత పొందలేని విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షల నోటిఫికేషన్ జారీచేశామని, జనవరి 5 వరకూ దరఖాస్తులు స్వీకరణ ఉంటుందని పేర్కొన్నారు. సుమారు 5 వేల మంది విద్యార్థులకు ఈ పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తున్నామని, ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ