
విజయవాడ, 02 జనవరి (హి.స.)
విజయవాడ కనకదుర్గమ్మ (Vijayawada Kanakadurgamma) ఆలయంలో కొత్త నిబంధన అమలులోకి వచ్చింది. ప్రముఖులు (VIP, VVIP) సైతం ప్రత్యేక దర్శనం కోసం టిక్కెట్ కొనుగోలు ఆలయ పాలక మండలి తప్పనిసరి చేసింది. ఈ విషయమై ఆలయ అధికారులు మాట్లాడుతూ ఆలయ నిర్వహణ నిధులను పెంచడమే లక్ష్యంగా కొత్త నిబంధనను అమలులోకి తెచ్చామన్నారు. వేలాది మంది భక్తులు ప్రతిరోజూ అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పారు. సాధారణ రోజుల్లో 30 వేల మంది భక్తులు దర్శించుకుంటున్నారు అని అన్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో దర్శించుకునే భక్తుల సంఖ్య 50వేలకు పైనే ఉంటోందన్నారు.
అయితే రోజులో 200ల నుంచి 300ల మంది VIP, VVIP సిఫార్సు లెటర్లతో వస్తున్నారని.. వారంతా టికెట్ కొనకుండా దర్శనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా కొంత మంది ప్రోటోకాల్ పేరుతో టికెట్ లేకుండానే దర్శనాలు చేస్తున్నారన్నారు. దాని వల్ల ఆలయ ఆదాయానికి నష్టం జరుగుతోందని గుర్తించడం జరిగిందన్నారు. ఈ విధానానికి అడ్డుకట్ట వేయాలని ధర్మకర్తల మండలిలో నిర్ణయించారన్నారు. అందుకోసం ఆలయ ఈఓ శీనా నాయక్, పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, ధర్మకర్తల మండలి సభ్యులు, ఇతర ఆలయాధికారులతో సమీక్ష జరిగిందన్నారు. సిఫార్సు లెటర్లతో వచ్చే ప్రతిఒక్కరూ టికెట్ కొనాల్సిందేనని అంగీకారనికి వచ్చారని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV