
నూజివీడు, 05 జనవరి (హి.స.):రానున్న రోజుల్లో విద్యుత్ చార్జీలు మరింత తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడులోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే చార్జీలు పెంచబోమన్న హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. సోలార్, విండ్, బయో విద్యుత్ రంగాల్లో 80 గిగావాట్ల విద్యుత్‌ను తక్కువ ధరకు తీసుకునే విధంగా అగ్రిమెంట్ చేసుకుంటున్నామన్నారు. సూర్యఘర్ పథకం కింద పేదలకు సౌర విద్యుత్ యూనిట్లు అందిస్తున్నామని, ఎస్సీ, ఎస్టీలకు నూరుశాతం సబ్సిడీ, బీసీలకు అదనంగా రూ.50 వేలు సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు. నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ