
అమరావతి, 05 జనవరి (హి.స.)
మలికిపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకైంది. మలికిపురం మండలం ఇరుసుమండలో సుమారు 2 గంటలుగా గ్యాస్ పైకి చిమ్ముతోంది. దీంతో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలాన్ని తహసీల్దార్ శ్రీనివాసరావు పరిశీలించారు. దీనిపై ఓఎన్జీసీ ఉన్నతాధికారులకు తెలియజేశామని.. ఆ సంస్థ సాంకేతిక నిపుణులు చేరుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. రెవెన్యూ అధికారుల అప్రమత్తతతో గ్రామాన్ని ప్రజలు ఖాళీ చేశారు. ఇరుసుమండలో పెద్ద ఎత్తున కొబ్బరితోటలు దగ్ధమవుతున్నాయి. ఇరుసుమండ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో స్థానికులు ఆందోళన పడుతున్నారు. మంటల ధాటికి 500కిపైగా కొబ్బరి చెట్లు కాలిపోయినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో పరిస్థితులను జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎంపీ పర్యవేక్షిస్తున్నారు. చుట్టుపక్కల 5 కి.మీల పరిధిలో ఉన్న ప్రజలను ఖాళీ చేయిస్తున్నట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ