
సిద్దిపేట, 05 జనవరి (హి.స.)
సిద్దిపేట మెడికల్ కాలేజీలో విషాదం నెలకొంది. పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని ఓ జూనియర్ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన తోటి జూనియర్ డాక్టర్లు.. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకుండా పోయింది. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి కన్నుమూసింది.
జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన లావణ్య సిద్దిపేట మెడికల్ కాలేజీలో 2020 బ్యాచ్ విద్యార్థిని. హౌస్ సర్జన్ పూర్తి చేసిన ఆమె.. ప్రస్తుతం సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇంటర్న్షిప్ చేస్తోంది. ఏమైందో తెలియదు గానీ.. శనివారం ఉదయం హాస్టల్లోనే గడ్డి మందును ఇంజెక్ట్ చేసుకుని ఆత్మహత్యకు యత్నించింది.
ఇది గమనించిన తోటి డాక్టర్లు వెంటనే జీజీహెచ్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందింది. ఇంటర్న్షిప్ డ్యూటీలు, నీట్ పీజీ ప్రిపరేషన్ ఒత్తిడితో లావణ్య ఆత్మహత్యకు పాల్పడినట్లుగా మెడికల్ కాలేజీ సిబ్బంది చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..