
అమరావతి, 05 జనవరి (హి.స.)అవయవదానం చేసిన జీవన్మృతుల కుటుంబాల త్యాగాన్ని గుర్తిస్తూ రూ.లక్ష చొప్పున అందజేయాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ప్రతిపాదనలు పంపించారు. దీనివల్ల బాధిత కుటుంబాలకు కాస్త అయినా సాంత్వన చేకూరడమే కాకుండా.. అవయవదానాన్ని మరింత ప్రోత్సహించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. గత ఏడాదిలో 93 మంది జీవన్మృతుల ద్వారా సేకరించిన అవయవాలను 301 మందికి అమర్చినట్లు వివరించారు. ప్రజల్లో అపోహలు తొలగించి, అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు బాధిత కుటుంబాలకు అందించే సాయాన్ని లక్షకు పెంచాలన్న ప్రతిపాదనను పంపించామని పేర్కొన్నారు. దాతల కుటుంబాల ఆర్థిక నేపథ్యాన్ని అనుసరించి.. ఒకరికి ప్రభుత్వం తాత్కాలిక ఉద్యోగ అవకాశాన్ని కూడా కల్పిస్తే బాగుంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ