భారీ పొగమంచు ఎఫెక్ట్.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం
హైదరాబాద్, 05 జనవరి (హి.స.) హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరగడంతో పాటు దట్టంగా కురుస్తున్న పొగమంచు (Dense Fog) విమాన ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో (RGIA) విజిబిలిటీ 50 మ
శంషాబాద్ ఎయిర్పోర్ట్


హైదరాబాద్, 05 జనవరి (హి.స.)

హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరగడంతో పాటు దట్టంగా కురుస్తున్న పొగమంచు (Dense Fog) విమాన ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో (RGIA) విజిబిలిటీ 50 మీటర్ల కంటే తక్కువకు పడిపోయింది. దీంతో పైలట్లు విమానాలను ల్యాండ్ చేసేందుకు జంకతున్నారు. ఇప్పటికే శంషాబాద్లో ల్యాండ్ కావాల్సిన సుమారు 14 విమానాలను అధికారులు బెంగళూరు, గన్నవరం, చెన్నై విమానాశ్రయాలకు దారి మళ్లించారు. అందులో దుబాయ్, మస్కట్, రియాద్, కువైట్ వంటి విదేశీ నగరాల నుంచి వచ్చిన అంతర్జాతీయ విమానాలు కూడా ఉన్నాయి.

అదేవిధంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ, చండీగఢ్, రాంచీ, వారణాసి, విశాఖపట్నం, ముంబైకి వెళ్లాల్సిన సుమారు 19 విమాన సర్వీసులు రద్దు చేశారు. ముఖ్యంగా ఇండిగో సంస్థకు చెందిన అత్యధిక సర్వీసులపై ఈ ప్రభావం పడిందని ఎయిర్పోర్టు వర్గాలు తెలిపాయి. మరో 10కి పైగా విమానాలు 2 నుంచి 4 గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande