
అమరావతి, 05 జనవరి (హి.స.)
భారతీయ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) రిఫైనరీలో మూడు దశల్లో చేపట్టిన విశాఖ రిఫైనరీ ఆధునీకరణ ప్రాజెక్టు (VRMP) విజయవంతంగా పూర్తయింది. ఈ ప్రాజెక్టులో భాగంగా అత్యాధునిక రెసిడ్యూ అప్‌గ్రేడేషన్ ఫెసిలిటీ (RUF)ను తాజాగా ప్రారంభించారు. ఇందులో ప్రపంచంలోనే అత్యంత బరువైన మూడు భారీ రియాక్టర్లను (LC-Max Reactors) ఏర్పాటు చేయడం విశేషం. సుమారు 2,200 మెట్రిక్ టన్నుల బరువున్న ఈ రియాక్టర్లు దేశీయంగా తయారై, భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని సంస్థ పేర్కొంది. ఈ ఆధునీకరణ ద్వారా రిఫైనరీ సామర్థ్యం ఏటా 8.3 మిలియన్ టన్నుల నుండి 15 మిలియన్ టన్నులకు పెరగడమే కాకుండా, పర్యావరణహితమైన భారత్ స్టేజ్-VI (BS-VI) ఇంధన ఉత్పత్తిలో భారత్ స్వయంసమృద్ధి సాధించనుందనే అభిప్రాయం నిపుణుల్లో వ్యక్తమవుతోంది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 31,407 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో పూర్తయిన ఈ ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్‌ను ఇంధన హబ్‌గా మార్చడమే కాకుండా స్థానికంగా భారీగా ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ అప్‌గ్రేడేషన్ ద్వారా ముడిచమురులోని అట్టడుగు వ్యర్థాలను కూడా 93 శాతం వరకు అత్యంత విలువైన పెట్రోలియం ఉత్పత్తులుగా మార్చవచ్చని అన్నారు. తద్వారా దిగుమతుల భారం తగ్గి ఏపీతో పాటు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి పొరుగు రాష్ట్రాల ఇంధన అవసరాలు తీరనున్నాయని పేర్కొన్నారు. ఈ మైలురాయితో భారతదేశ తూర్పు తీరం ప్రపంచ స్థాయి రిఫైనింగ్ హబ్‌గా అవతరించిందన్నారు. ఇది రాష్ట్ర సామాజిక-ఆర్థిక అభివృద్ధికి కొత్త దిశను చూపుతుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV