
అనంతపురం, 05 జనవరి (హి.స.)
అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండల పరిషత్ అధ్యక్ష (MPP) ఎన్నిక ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలకు గానూ గత ఎన్నికల్లో వైసీపీ 15 స్థానాలను కైవసం చేసుకోగా, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమీకరణాలు వేగంగా మారిపోయాయి. వైసీపీకి (YCP) చెందిన ఐదుగురు ఎంపీటీసీలతో పాటు స్వతంత్ర అభ్యర్థి కూడా టీడీపీ (TDP) గూటికి చేరడంతో ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. గతంలో ఎంపీపీగా పనిచేసిన పద్మ తన పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని వైసీపీ తీవ్రంగా ఆరోపిస్తోంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం అదనపు ఎస్పీని కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేసింది. టీడీపీ నాయకులు తమ పార్టీ ఎంపీటీసీలపై భౌతిక దాడులకు దిగుతున్నారని, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తమ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తోందని అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో జరిగేలా భారీ పోలీసు బలగాలను మోహరించాలని వారు విన్నవించారు. ఈ రాజకీయ చదరంగంలో బొమ్మనహల్ ఎంపీపీ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV