
అమరావతి, 05 జనవరి (హి.స.)
కూటమి ప్రభుత్వ హయాంలో పూర్తవుతున్న అభివృద్ధి పనులు తమ హయాంలో ప్రారంభించినవే అని వైసీపీ అంటోంది. తమ ప్రభుత్వం పునాదులు వేస్తే.. కూటమి ప్రభుత్వం పనులు పూర్తయ్యాక స్టిక్కర్లు వేసుకుంటోందని విమర్శిస్తోంది. దీంతో రాష్ట్రంలో ఇరు పార్టీల మధ్య క్రెడిట్ ఎవరిదీ అనే అంశమై విమర్శలు, ప్రతి విమర్శలు జోరుగా నడుస్తున్నాయి. వైసీపీ వాళ్లు అది తమ ఘనత అంటే.. అలా కాదు మీరు దాన్ని వ్యతిరేకించారని టీడీపీ అంటోంది. కావాలంటే చూస్కోండి వీడియోలు అంటూ గతంలో ఆ పార్టీ అధినేత మాట్లాడిన వీడియోలను టీడీపీ చూపిస్తోంది. ఇదిలా ఉంటే వైసీపీ కూడా తామేం తక్కువ తిన్నాం అంటూ గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన జీఓలు, లెక్కా పత్రాలను చూపిస్తూ తన వాదన బలపరుచుకునే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు, అభిమానులు, నాయకుల మధ్య ఇటు లైవ్ లోనూ, అటు సోషల్ మీడియా వేదికగా వాడివేడి వాదోపవాదాల జరుగుతున్నాయి. మొత్తానికి ఇరు పార్టీల చర్చలో వాస్తవాలు బయటకు వస్తున్నాయని వాటిని గమనిస్తున్న వారు అనుకుంటున్నారు.
ఈ క్రమంలో వైసీపీ పార్టీకి చెందిన విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 10న తరువాత అందుబాటులోకి రానున్న చీపురుపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి గురించి ఆయన మాట్లాడారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు సంబంధించి కూడా ప్రస్తావన చేశారు. ఆయన మాట్లాడుతూ చీపురుపల్లి రైల్వే బ్రిడ్జి కోసం వైయస్ జగన్ హయాంలో అప్పటి స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, తాను రైల్వే శాఖ డీఎం దగ్గరికి వెళ్లి అనుమతులు తీసుకుని వచ్చామని పేర్కొన్నారు. 80 శాతం పనులను వైసీపీ హయాంలోనే పూర్తి చేశామన్నారు. తర్వాత ఎన్నికల కోడ్ రావడంతో పనులు నిలిపివేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలైనా 20శాతం పనులు పూర్తి చేయలేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. క్రెడిట్ చోరీ ఛాంపియన్ అయిన కూటమి ప్రభుత్వం తాజాగా ఇంకో ప్రాజెక్టు ఘనతను తనఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందన్నారు.
రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తవడానికి టీడీపీ నాయకుల అండదండలు ఉన్నాయని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ లో తొలి విమానం రావడానికి చొరవ తీసుకున్న నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన ముందు చూపు వల్లే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం వచ్చిందన్నారు. జీఎంఆర్ సంస్థ మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పటి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి మాటిచ్చిన ప్రకారంగా పనులు పూర్తి చేశారన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV