
పుట్టపర్తి, 05 జనవరి (హి.స.)
శ్రీసత్యసాయి జిల్లాలో అరుదైన రికార్డుకు అడుగులు పడ్డాయి. బెంగళూరు-విజయవాడ ఎకనామిక్ కారిడార్ (NH-544G) నిర్మాణంలో భాగంగా 'రాజ్పథ్ ఇన్ ఫ్రాకాన్' సంస్థ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. కేవలం ఏడు రోజుల్లో 26 కిలోమీటర్ల మేర ఆరు వరుసల రహదారిని నిర్మించి, ఏకంగా 4 గిన్నిస్ వరల్డ్ రికార్డులను తన ఖాతాలో వేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిష్టాత్మక పనులు పుట్టపర్తి మండలం సత్తార్లపల్లి నుంచి ముదిగుబ్బ మండలం మలకవేముల క్రాస్ వరకు శరవేగంగా సాగుతున్నాయి.
ఏడు రోజుల్లో 26 కిలోమీటర్లు
సాధారణంగా కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించడానికి నెలల సమయం పడుతుంది. కానీ రాజ్పథ్ ఇన్ ఫ్రాకాన్ సంస్థ అత్యాధునిక సాంకేతికతతోపాటు వేలాది మంది కార్మికులను రంగంలోకి దించి కేవలం ఏడు రోజుల్లో (జనవరి 5 నుంచి జనవరి 11 వరకు) 26 కిలోమీటర్ల ఆరు వరుసల బీటీ రోడ్డును పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ పనుల కోసం రాత్రింబవళ్లు దాదాపు 36,000 మెట్రిక్ టన్నులకు పైగా నిర్మాణ సామగ్రిని వాడుతున్నారు. ఎక్కడా విరామం లేకుండా సాగుతున్న ఈ యజ్ఞం భారతీయ మౌలిక సదుపాయాల రంగంలో ఒక మైలురాయిగా నిలవనుందని సంస్థ ధీమా వ్యక్తం చేస్తోంది.
4 గిన్నిస్ రికార్డులే లక్ష్యం
ఈ నిర్మాణ పనుల ద్వారా సంస్థ నాలుగు విభిన్న విభాగాల్లో గిన్నిస్ రికార్డులను ఆశిస్తోంది. అందులో మొదటిది24 గంటల్లో అత్యధిక దూరం (5 కిలోమీటర్లు) బిటుమినస్ కాంక్రీట్ రహదారి నిర్మించడం. నిర్ణీత సమయంలో అత్యధిక మొత్తంలో నిర్మాణ సామగ్రి వినియోగించడం. అతి తక్కువ సమయంలో నిరంతరాయంగా సుదీర్ఘ రహదారి నిర్మాణం చేపట్టడం. ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవేను రికార్డు స్థాయిలో పూర్తి చేయడం వంటి రికార్డులను సాధించడమే లక్యంగా సంస్థ పని చేస్తోంది.
బెంగళూరు-విజయవాడ తగ్గనున్న సమయం
ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా మారిపోనుంది. సుమారు 19,000 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ 624 కిలోమీటర్ల ఎకనామిక్ కారిడార్ వల్ల బెంగళూరు నుంచి విజయవాడకు ప్రయాణ సమయం ప్రస్తుతమున్న 12 గంటల నుంచి కేవలం 6 గంటలకు తగ్గిపోనుంది. ఇది పారిశ్రామికాభివృద్ధికి, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఎంతో దోహదపడుతుందని సంస్థ పేర్కొంటుంది. గ్రీన్‌ఫీల్డ్ అలైన్‌మెంట్ ద్వారా నిర్మిస్తున్న ఈ రహదారి వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తప్పుతాయని చెబుతోంది.
నితిన్ గడ్కరీ చేతుల మీదుగా రికార్డు ప్రదానం
ఈ బృహత్తర కార్యం ముగిసిన అనంతరం జనవరి 12న పుట్టపర్తిలో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యే అవకాశం ఉంది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV