
ములకలచెరువు, 06 జనవరి (హి.స.) :అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ను, ఆయన సోదరుడు రామును సోమవారం విజయవాడ జైలుకు తరలించారు. ఈ కేసులో నిందితులైన జోగి సోదరులను మూడు రోజుల కస్టడీకి ఇస్తూ తంబళ్లపల్లె జూనియర్ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కస్టడీ గడువు ముగియడంతో ఆదివారం రాత్రి వారిని ఎక్సైజ్ పోలీసులు తంబళ్లపల్లె కోర్టులో హాజరు పరిచారు. రాత్రి పొద్దుపోవడంతో అక్కడి నుంచి మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు. సోమవారం ఉదయం మదనపల్లె సబ్‌జైలు నుంచి ప్రత్యేక బందోబస్తు మధ్య విజయవాడకు తీసుకెళ్లారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ