
హైదరాబాద్, 06 జనవరి (హి.స.) శాసనసభ వేదికగా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తన నియోజకవర్గ సమస్యలను వినూత్న రీతిలో సభ దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలో వారు మాట్లాడుతూ.. విద్యా సౌకర్యాలు లేక తన నియోజకవర్గ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను వివరించడంతో పాటు, ఒక జానపద గీతంతో సభను ఆకట్టుకున్నారు. నియోజకవర్గంలోని దమ్మపేట, చంద్రుగొండ మండలాల్లో ఇప్పటికీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు లేవనీ, ప్రతి ఏటా సుమారు 500 మందికి పైగా విద్యార్థులు పదో తరగతి ఉత్తీర్ణులవుతున్నారనీ, పై చదువుల కోసం వారు పొరుగున ఉన్న ఖమ్మం జిల్లా సత్తుపల్లికి లేదా కొత్తగూడెంకు వెళ్లాల్సి వస్తోందని అన్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లలేక ముఖ్యంగా పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారనీ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికైనా ఆయా మండలాల్లో కాలేజీలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు