
హైదరాబాద్, 06 జనవరి (హి.స.) ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు
ప్రారంభమయ్యాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మొదటగా ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖకు సంబంధించిన ఎలక్ట్రికల్ వెహికల్స్ పాలసీ, టి జి ఎస్ ఆర్ టి సి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ రిజిస్ట్రేషన్ అయ్యాయి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటని బీజేపీ సభ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు.
అదే విధంగా రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ విపరీతంగా పెరుగుతున్నాయని, కానీ అందుకు అనుగుణంగా ఛార్జింగ్ స్టేషన్లు లేవని బీజేపీ సభ్యుడు పాల్వాయి హరీశ్ బాబు ప్రశ్నించారు. ఇక ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట పరిధిలో ఉన్న ఆర్టీసీ డిపోకు ఎలక్ట్రికల్ బస్సులు కేటాయించాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మంత్రి పొన్నం ప్రభాకర్ కు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా కుగ్రామాలను లింక్ చేసే రోడ్ల వరకే ఆర్టీసీ బస్సులు వెళ్తున్నాయని, దీంతో ప్రధాన రహదారి నుంచి 2, 3 కి.మీ. దూరంలో ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ సభ్యుడు రేకులపల్లి భూపతి రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్కు తెలిపారు. ఈ మేరకు సభ్యులు చెప్పిన సమస్యలను తాను నోట్ చేసుకున్నట్లుగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పీకర్కు విన్నవించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..