
సిద్దిపేట , 06 జనవరి (హి.స.)
సిద్దిపేట జిల్లా వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగిన యువ పార్లమెంట్ పోటీలకు హాజరైన మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మీడియా వేదికగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్సీ కవిత శాసనమండలిలో కేసీఆర్ను ప్రశ్నించడం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామమని, పదేళ్లు తెలంగాణను పక్కన పెట్టి దేశమంతా తిరిగినందుకు సొంత బిడ్డే ఇప్పుడు సమాధానం అడుగుతోందని ఎద్దేవా చేశారు. పంజాబ్ రైతులకు తెలంగాణ సొమ్ము పంచిన కేసీఆర్, ఇక్కడి స్థానిక రైతులకు ఎందుకు అన్యాయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో జరుగుతున్న భాషా సంభాషణలు అత్యంత దారుణంగా ఉన్నాయని, నీ నోరు కంపు నా నోరు కంపు అనే స్థాయికి రాజకీయాలు దిగజారడం మేధావులను, యువతను ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సహా నేతలందరూ తమ భాషను నియంత్రించుకోవాలని హితవు పలికారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు