
మహబూబ్నగర్, 06 జనవరి (హి.స.) పాలమూరు ప్రాజెక్టుల ప్రజల సమక్షంలోనే చర్చిద్దాం.. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చర్చలకు రావాలి అని బీఆర్ఎస్ మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ప్రాజెక్టుల బాట కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మొదటగా జూరాల ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు ఉమ్మడి పాలమూరు జిల్లాను పట్టించుకోలేదు. ప్రాజెక్టులు నిర్మించారు అంటే ఆంధ్ర ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు వారి అవసరాల కోసం నిర్మించారు తప్ప.. ఉమ్మడి పాలమూరు జిల్లా కోసం ఎంత మాత్రం కాదు అని అన్నారు. కేసీఆర్ సారధ్యంలో సాగిన తెలంగాణ ఉద్యమం కారణంగానే జూరాల ప్రాజెక్టు పూర్తి అయ్యింది అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు