
హైదరాబాద్, 06 జనవరి (హి.స.)
రాష్ట్రంలో గత పాలకుల హయాంలో
అశాస్త్రీయంగా జరిగిన మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇవాళ అసెంబ్లీలో శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు రామ్మోహన్ రెడ్డి, వీరేశం, పాల్యాయి హరీష్ తదితరులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో మండలాల ఏర్పాటు మొదలుకొని జిల్లాల పునర్వ్యవస్థీకరణ వరకు ఇష్టానుసారంగా, ఎవరి అభ్యర్థనలను పట్టించుకోకుండా చేశారని విమర్శించారు. దీంతో ఒకే నియోజకవర్గంలోని నాలుగు మండలాలు నాలుగు జిల్లాల్లో ఉండే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఆవశ్యకతను కూడా గుర్తించామని తెలిపారు. కేబినెట్లో విస్తృతంగా చర్చించి, రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని స్పష్టం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు