
జగిత్యాల, 06 జనవరి (హి.స.)
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొండగట్టు అభివృద్ధికి వందల కోట్ల హామీలు ఇచ్చినా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. నాయకుడు వచ్చాడు... హామీలు ఇచ్చాడు.... కానీ నయా పైసా రాలేదు అంటూ మాజీ సీఎం కేసీఆర్ పై సెటైర్లు విసిరిన సత్యం, ఒక్క రూపాయి వచ్చినట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ విసిరిన సవాల్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
కాగా ఎమ్మెల్యే సత్యం విసిరిన సవాల్ను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్వీకరించారు. దమ్ముంటే టైం, డేట్ ఫిక్స్ చెయ్... బీఆర్ఎస్ హయాంలో కొండగట్టుకు వచ్చిన నిధుల పూర్తి లెక్కలతో కొండగట్టు వై జంక్షన్ వద్దకు వస్తా అంటూ ప్రతిసవాల్ విసరడం రాజకీయ వేడిని మరింత పెంచింది. నిధులు వచ్చాయని నిరూపిస్తే సత్యం తన మాట ప్రకారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని రవిశంకర్ డిమాండ్ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు