
హైదరాబాద్, 06 జనవరి (హి.స.)
కృష్ణా జలాల విషయంలో తాము చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయనే భయంతోనే బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ నుంచి పారిపోయారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద
మాట్లాడుతూ.. ప్రతిపక్ష హోదాలో ఉండి సభకు రాకుండా బయట ప్రగల్భాలు పలకడం సిగ్గుచేటని విమర్శించారు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించే ధైర్యం లేక కృష్ణా జిల్లా ప్రాజెక్టుల విషయంలో తాము చేసిన చారిత్రక తప్పిదాలు ఎక్కడ బహిర్గతం అవుతాయోనని భయపడి బీఆర్ఎస్ నేతలు దాక్కుంటున్నారని ఫైర్ అయ్యారు. సభకే రాని వీరు సభా హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. అకారణంగా స్పీకర్పై నిందలు వేయడం బీఆర్ఎస్ సభ్యుల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. స్పీకర్ వ్యవస్థను కించపరిచేలా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు