
అమరావతి, 06 జనవరి (హి.స.)
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వెలగపూడిలోని సచివాలయంలో అటవీశాఖ ఉన్నతాధికారులతో కీలక సమీక్షా సమావేశాన్ని (Review Meeting) నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పురోగతిపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న 974 కిలోమీటర్ల తీరప్రాంతాన్ని తుఫానులు, కోత, పర్యావరణ ముప్పుల నుండి రక్షించేందుకు ఈ 'గ్రీన్ వాల్' ఒక సహజ రక్షణ కవచంలా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. తీరప్రాంతంలో మడ అడవులు, తాటి చెట్లు, ఇతర స్థానిక వృక్షజాతులను పెంచడం ద్వారా సముద్రపు అలల తీవ్రతను తగ్గించడమే కాకుండా.. మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచవచ్చని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV