ఏటా జనవరి వస్తోంది.. పోతుంది : వైయస్ షర్మిల
ఏటా జనవరి వస్తోంది.. పోతుంది : వైయస్ షర్మిల
షర్మిల


అమరావతి, 06 జనవరి (హి.స.)

జాబ్ క్యాలెండర్ విషయమై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైయస్ షర్మిల కూటమి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ఈ విషయమై తన ఎక్స్ ఖాతాలో ప్రత్యేక పోస్టును చేశారు. రెండేళ్ల పాలనలో హామీలు ఘనంగా ఉన్నాయిగానీ, అమలులో మాత్రం మోసం జరుగుతోందని ఆరోపించారు. ప్రతి ఏటా జనవరి వస్తోంది.. పోతోందని.. క్యాలెండర్ మారుతున్న జనవరి ఒకటో తారీఖు ఇస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్ మాత్రం ఏ దిక్కున ఉందో తెలియడం లేదన్నారు. ఉద్యోగాల పేరుతో ఆశచూపి నిరుద్యోగుల ఓట్లను కూటమి పార్టీలు దండుకున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచి రెండో ఏడాది వచ్చినా జాబ్ క్యాలెండర్ ఊసెత్తకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడడం సరికాదన్నారు.

గత వైసీపీ పాలనపై విమర్శలను గుప్పిస్తూ.. గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరిట యువత చెవుల్లో పూలు పెడితే, కూటమి ప్రభుత్వం ఏకంగా క్యాలీఫ్లవర్లు పెడుతోందని ఎద్దేవా చేశారు. 2025 జనవరి 1 నుంచి క్రమం తప్పని జాబ్ క్యాలెండర్ ఎక్కడ ? రెండేళ్లలో రెండు జాబ్ క్యాలెండర్ల సంగతేంటి ? ఇదిగో అదిగో అని ఊరించడం తప్పా ఉద్యోగాల భర్తీ షెడ్యూల్ ఏది ? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ హామీ జాబ్ క్యాలెండర్ కాదు.. జోక్ క్యాలెండర్ అంటూ అసహనం వ్యక్తం చేశారు. నిరుద్యోగ బిడ్డలను దగా చేసిన దగా క్యాలెండర్ అంటే ఆవేదనకు లోనయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande