
అమరావతి, 07 జనవరి (హి.స.)
అమరావతి, పోలవరం ప్రాజెక్టులో 87 శాతం సివిల్ పనులు పూర్తయ్యాయని.. గడువులోగా మిగిలిన పనులన్ని పూర్తి చేయాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎడమ కాలువ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. కుడి కాలువ ద్వారా కొల్లేరు ప్రాంతాలకు సైతం నీరు వెళ్లేలా చూడాలని ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బుధవారం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై ఉన్నతాధికారుల నుంచి ఆయన ఆరా తీశారు. అనంతరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా జరుగుతున్న పనులపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. నిర్వాసితుల పునరావాసంతోపాటు ఆర్ అండ్ ఆర్ పనులపై దృష్టి కేంద్రీకరించాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మే మొదటి వారంలో మళ్లీ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను తనిఖీ చేస్తానని వారికి సీఎం చంద్రబాబు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ