
హైదరాబాద్, 08 జనవరి (హి.స.) ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మార్పులు గ్రామీణ కూలీలకు 'మరణ శాసనం' లాంటివని నీటిపారుదల శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. నరేగా చట్టంలో మహాత్మాగాంధీ పేరును తొలగించడం, పని హక్కులు, నిధులను కుదించడం అన్యాయమని అన్నారు. గాంధీభవన్లో గురువారం జరిగిన పీసీసీ, పీఏసీ విస్తృతస్థాయి సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం సోనియా గాంధీ మానసపుత్రికగా, గ్రామీణ ప్రాంతాల్లో విప్లవాత్మక మార్పులకు దోహదపడిందని పేర్కొన్నారు.
పేదలకు పని హక్కు, కనీస వేతనం కల్పించిన ఈ చట్టాన్ని మోడీ ప్రభుత్వం బలహీన పరిచిందని ఆరోపించారు. జాబ్ కార్డు ఉన్న వారికి 100 రోజుల ఉపాధి హామీ దెబ్బతిందని, గ్రామ పంచాయతీలకు ఉన్న అధికారాలను తీసేశారని విమర్శించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు